బందరు తీరంలో ‘లంగరు’.. శరవేగంగా పనులు – AP Government
కృష్ణా జిల్లా వాసుల దశాబ్దల కల నెరవేరనుంది. సుదీర్ఘ కాలం తర్వాత మచిలీపట్నం బందరు పోర్టు అందుబాటులోకి రానుంది. ఈ పోర్టును సుమారు 11,454 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుండగా.. తొలిదశ కింద రూ.5,254 కోట్లతో నాలుగు బెర్తుల నిర్మాణానికి సీఎం జగన్ ఈ ఏడాది మే 22న భూమి పూజచేశారు. ఈ మేరకు 30 నెలల్లో పనులు పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. కాగా, ప్రస్తుతం ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పోర్టు నిర్మాణానికి సంబంధించిన సరిహద్దులను అన్ని అనుమతులతో ఇప్పటికే గుర్తించి మార్కింగ్ చేశారు. కాగా, ఇప్పటికే నార్త్‌బ్రేక్ వాటర్ నిర్మాణం పూర్తికాగా, సౌత్‌బ్రేక్ వాటర్ నిర్మాణ పనులు సైతం 70 శాతం వరకు పూర్తయ్యాయి. అలాగే రెండు బెర్తుల నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
చివరి దశలో పనులు..
స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో రాష్ట్రంలో కేవలం ఆరు పోర్టులు కడితే.. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నవశకానికి నాంది పలికారు. కేవలం నాలుగున్నర ఏళ్లల్లో నాలుగు పోర్టుల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రామాయపట్నం, కాకినాడ గేట్‌వే పోర్టు పనులు పూర్తయ్యాయి ఇక మూలపేట, మచిలీపట్నం పోర్టు పనులు చివరి దశలో ఉన్నాయి. 35.12 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో రెండు జనరల్ కార్గోకు, ఒకటి బొగ్గుకు, మరొకటి మల్టీపర్పస్ కంటైనర్‌తో ఎగుమతి, దిగుమతులకు ఉపయోగపడేలా మొత్తం నాలుగు బెర్తులతో మచిలీపట్నం పోర్టును 30 నెలల్లో పూర్తిచేయనున్నారు.
విస్తరించనున్న వ్యాపారం
ప్రభుత్వ వ్యయంతో నిర్మిస్తున్న ఈ పోర్టు రాకతో వాణిజ్య కార్యకలాపాలు విస్తరించనున్నాయి. ఈ పోర్టు నిర్మాణం ద్వారా తెలంగాణతో పాటు ఏపీలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలు ప్రయోజనం కలుగుతుంది. ఎరువులు, బొగ్గు, వంట నూనెలు, కంటైనర్ల దిగుమతులకు ఈ పోర్టు అనువుగా ఉండనుంది. ఈ పోర్టు క్లింకర్, గ్రానైట్ బ్లాక్, ముడి ఇనుము ఎగుమతికి ప్రయోజనకరంగా ఉంటుంది. పోర్టు అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభించనుంది. వాణిజ్య కార్యకలాపాలు విస్తరించే కొద్దీ 16 బెర్తులతో 116 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును విస్తరించేలా ప్రణాళిక రూపొందించారు.