🌟 Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు భారీ శుభవార్త – ప్రమోషన్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం!
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల (Promotions) దిశగా ముందడుగు వేసింది.
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రమోషన్ వ్యవస్థపై సమగ్ర అధ్యయనం చేయడానికి మంత్రివర్గ ఉపసంఘంని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కమిటీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వం వహిస్తారు. మొత్తం 10 మంది మంత్రులతో కూడిన ఈ ఉపసంఘం గ్రామ, వార్డు సిబ్బందికి పదోన్నతులు ఎలా ఇవ్వాలి, మధ్యస్థ పోస్టులు ఎలా సృష్టించాలి, కొత్త పే స్కేలు ఎలా ఉండాలి వంటి అంశాలపై సమగ్రంగా చర్చించనుంది.
వీలైనంత త్వరగా ఈ కమిటీ తన నివేదికను సమర్పించాలని సీఎస్ ఆదేశించారు. దీంతో వేలాది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న ప్రమోషన్‌లకు ఇప్పుడు దారులు తెరచుకున్నాయి.
ఇటీవలే ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ బదిలీలను పూర్తి చేసింది. మే 31 నాటికి ఐదేళ్లు పూర్తిచేసిన వారిని బదిలీ చేసింది. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో పనిచేసేవారు, అంధులు, వైకల్యంతో ఉన్నవారు, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది.
భార్యాభర్తలు ఇద్దరూ సచివాలయంలో పనిచేస్తే ఒకరికి దగ్గర పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పుడు పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమవడంతో సచివాలయ ఉద్యోగులలో ఆనందం వెల్లివిరుస్తోంది.
🎉 ఇది నిజంగా గ్రామ, వార్డు సిబ్బందికి దీపావళి గిఫ్ట్‌లాంటి శుభవార్త!